Current Date: 12 Feb, 2026

టాలీవుడ్‌లో మళ్లీ సమ్మె సైరన్.. 18 రోజులే గడువు

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో సినీ కార్మికుల సమస్యలు మళ్లీ మొదటికొచ్చాయి. గతంలో తలెత్తిన వివాదాలు సద్దుమణిగాయని భావిస్తున్న తరుణంలో, తాజాగా టెక్నీషియన్స్, ప్రొడక్షన్ యూనియన్ సభ్యులు ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడికి లేఖలు రాయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తమ దీర్ఘకాలిక సమస్యలను ఈ నెలాఖరులోపు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేవలం ఈ రెండు యూనియన్లే కాకుండా, మరో 11 యూనియన్లు కూడా ప్రస్తుత పరిస్థితులపై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, ఫిల్మ్ ఛాంబర్ పెద్దలతో చర్చలు జరిపి తమకు తక్షణమే న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. తమ డిమాండ్లను పట్టించుకోకపోతే సమ్మెకు దిగక తప్పదని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఫిబ్రవరి నెలాఖరులోపు సమస్యలు పరిష్కారం కాకపోతే, మార్చి 1వ తేదీ నుంచి పనులన్నీ నిలిపివేసి సమ్మె చేపడతామని టెక్నీషియన్, ప్రొడక్షన్ యూనియన్లు స్పష్టం చేశాయి. ఈ పరిణామాలతో టాలీవుడ్‌లో షూటింగ్‌లు నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో చిత్ర నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.