జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన ఆరోపణల వ్యవహారం ఇప్పుడు ఆడియో క్లిప్పుల వివాదంగా మారింది. ఎమ్మెల్యేను సదరు బాధిత మహిళ రూ. 25 కోట్లు డిమాండ్ చేసినట్లు ఒక ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని, కావాలనే 29 సెకన్ల కట్ చేసిన ఆడియోను వదిలి తనను బద్నాం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ధైర్యముంటే పూర్తిస్థాయి ఆడియోను బయటపెట్టాలని ఆమె సవాలు విసిరారు.
ఈ వివాదానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని, ఇది ఒక అబ్బాయికి, అమ్మాయికి మధ్య జరిగిన వ్యక్తిగత విషయమని ఆమె స్పష్టం చేశారు. తాను పంచాయతీ ఆఫీస్‌లో ఉద్యోగిని అని, తన శాఖకు మంత్రి కూడా పవన్ కల్యాణేనని ఆమె గుర్తు చేశారు. తనను ఏ రాజకీయ పార్టీ ప్రలోభపెట్టలేదని, కేవలం తనకు జరిగిన అన్యాయంపైనే పోరాడుతున్నానని పేర్కొన్నారు. మీడియా వారు తనను విమర్శించడం మాని, ఎమ్మెల్యే నుంచి వివరణ కోరాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే శ్రీధర్‌కు సంబంధించి మరికొన్ని వీడియోలు కూడా తాజాగా బయటకు వచ్చి కలకలం రేపుతున్నాయి. తాను ఎమోషనల్‌గా మాట్లాడితే ఒకలా, నిమ్మళంగా మాట్లాడితే మరోలా అర్ధాలు తీస్తూ తన క్యారెక్టర్‌ను కించపరుస్తున్నారని బాధిత మహిళ వాపోయారు. ప్రస్తుతం ఈ రాసలీలల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.