Current Date: 04 Jul, 2024

కౌంటింగ్‌కు వేళాయె... హైటెన్షన్‌కు నేటితో తెర...

తెల్లారింది! ఎన్నాళ్లో వేచిన ఉదయం వచ్చేసింది! అటో ఇటో తేలిపోయే సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల వైసీపీ పాలనకు జనం పాతరేస్తారా? లేక... ‘వన్స్‌ మోర్‌’ అని గెలిపిస్తారా? ‘మీ అరాచకాలు భరించలేం’ అని వైసీపీకి తేల్చిచెప్పి... సంక్షేమం, అభివృద్ధి సమ్మిళితంగా సాగిస్తామనే టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే పట్టం కడతారా? ‘ఎగ్జిట్‌ పోల్స్‌’ అంచనాలు ఏ మేరకు నిజమవుతాయి? అత్యధిక సర్వేలు స్పష్టం చేసినట్లుగా కూటమినే విజయం వరిస్తుందా? లేక... ఈ అంచనా తిరగబడుతుందా? ఇన్ని ప్రశ్నలకు సమాధానం లభించే సమయం ఆసన్నమైంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకల్లా ‘తుది ఫలితం’పై ఒక స్పష్టత వచ్చేస్తుంది. అప్పటిదాకా హైటెన్షన్‌ తప్పదు మరి.