ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చిరకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ రెండు జట్లు తలపడిన ప్రతిసారి ఆటగాళ్లు పోటాపోటీగా ఆడి రికార్డులు బద్దలు కొడుతుంటారు. అలానే టీమ్స్ కూడా ఆఖరి బంతి వరకూ గట్టిగా పోటీని ఇస్తుంటాయి. ఇందులో చాలా సార్లు హైదరాబాద్ పైచేయి సాధించగా.. గురువారం రాత్రి ఉప్పల్‌లో హైదరాబాద్‌ను ఓడించిన బెంగళూరు ప్రతీకారం తీర్చుకుంది.
మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన బెంగళూరు టీమ్ 7 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఛేదనలో ఆశించిన మేర దూకుడుగా ఆడలేకపోయిన హైదరాబాద్ 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు మాత్రమే చేయగలిగింది. హైదరాబాద్ బౌలర్లు తొలుత ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. బ్యాటర్లు ఒత్తిడిని అధిగమించలేక చేతులెత్తేశారు.
బెంగళూరు టీమ్‌కి వరుసగా ఆరు ఓటముల తర్వాత దక్కిన విజయం ఇది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో చివరి స్థానానికే ఆర్సీబీ పరిమితమైంది. మరోవైపు 8 మ్యాచ్‌లాడిన హైదరాబాద్ టీమ్‌కి ఇది మూడో ఓటమి. దాంతో మూడో స్థానానికి పడిపోయింది.