కోరిన కోర్కెలు తీర్చే దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారికి మొక్కులు చెల్లించేందుకు, దర్శనం చేసుకునేందుకు కాలినడకన తిరుమల చేరుకునే భక్తుల సంఖ్య పెద్దగానే ఉంటుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అలిపిరి మార్గంలో ప్రతి నిత్యం వేలాది మంది తరలి వెళుతుంటారు. వీరిలో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా ఉంటారు. అలాంటివారికి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. 60 ఏళ్లు పైబడిన వృద్ధులతో పాటు షుగర్, బీపీ, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ల వ్యాధులు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు కాలినడకన తిరుమల రావడం మంచిది కాదని, కాలినడకన రావడం చాలా అలసటతో కూడుకున్నదని, అందుకే ఆరోగ్య సమస్యలు ఉన్న భక్తులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని సూచించింది. ఏదైనా అనారోగ్య సమస్య వస్తే అలిపిరి మార్గంలో 1500వ మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సాయం పొందవచ్చని తెలిపింది.
Share