Current Date: 04 Jul, 2024

చిక్కుల్లో పడిన పిన్నెల్లి.. వెబ్ కెమెరాల్లో అడ్డంగా బుక్!

పల్నాడు జిల్లా మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కఠిన చర్యలను తీసుకోవాలంటూ ఆదేశాలను జారీ చేసింది.

పోలింగ్ రోజున మాచర్ల అసెంబ్లీ పరిధిలోని 202, 7వ నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఆ విజువల్స్ తాజాగా వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం ఈ వీడియోల్లో చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైసీపీ వాదన. అదెలా ఉన్నప్పటికీ- పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.