జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగష్టు 7న పొందూరు ఖాదీపై వీడియో పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ కమిషనర్ శ్రీ కె. శ్రీకాంత్ ప్రభాకర్ శుక్రవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం రగిలించడమే కాక స్వదేశీ వస్తు ఉద్యమంలో కూడా చేనేత వస్త్ర ఉత్పత్తి కీలక పాత్ర పోషించిందన్నారు. మహాత్మా గాంధీని ఎంతగానో ప్రభావితం చేసిన పొందూరు ఖాదీ వస్త్రాలు శ్రీకాకుళంనకు 25కి.మీ.ల దూరంలోని పొందూరు గ్రామంలో తయారు కాబడి నేటికీ ప్రసిద్ధి పొందుతున్నాయన్నారు. అందులో భాగంగా భారతీయ చరిత్రలో చేనేత యొక్క ప్రాధాన్యతకు గుర్తింపుగా 2015 నుంచి ప్రతి ఏటా ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. పొందూరు ఖాదీపై వీడియో పోటీలు : ఈ ఏడాది జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం పొందూరు ఖాదీ తయారీపై ‘వీడియో’ పోటీలు నిర్వహిస్తోందన్నారు. ఈ పోటీలో పాల్గొనదలచినవారు పొందూరు ఖాదీ వస్త్ర తయారీలోని అన్ని దశలను పొందుపరుస్తూ చక్కటి వీడియోను రూపొందించాలన్నారు.
Share