Current Date: 08 Feb, 2026

సర్పంచ్ పదవి కోసం కూతుర్ని చంపిన తండ్రి.. రూల్స్‌ రాసిన మరణశాసనం!

అధికార దాహం ఒక కన్న తండ్రిని రాక్షసుడిగా మార్చింది. మహారాష్ట్రకు చెందిన పాండురంగ అనే వ్యక్తి, సర్పంచ్ పదవికి పోటీ చేసేందుకు అడ్డంకిగా ఉన్న ముగ్గురు పిల్లల నిబంధనను అధిగమించడానికి తన 12 ఏళ్ల కూతురు ప్రాచీని అత్యంత కిరాతకంగా అంతమొందించాడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నిందితుడికి ముగ్గురు సంతానం ఉండటంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హుడవుతానని భావించాడు. ఈ అడ్డంకిని తొలగించుకోవడానికి తొలుత బర్త్ సర్టిఫికెట్ మార్చాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. చివరకు తన ముగ్గురు పిల్లల్లో ఒకరు తగ్గిపోతేనే పదవి దక్కుతుందని భావించి, ప్రస్తుత సర్పంచ్ గణేష్‌తో కలిసి కూతురిని చంపేందుకు కుట్ర పన్నాడు. ఊరికి వెళ్దామని నమ్మించి చిన్నారిని బైక్‌పై ఎక్కించుకుని నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ కెనాల్ వద్దకు తీసుకువచ్చాడు. నిర్మానుష్య ప్రాంతంలో కూతురు ఎంత ప్రాధేయపడినా వినకుండా ఆమెను కాలువలోకి తోసేసి నిందితుడు పరారయ్యాడు. జనవరి 30న కాలువలో బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, అది మహారాష్ట్రకు చెందిన ప్రాచీగా గుర్తించారు. లోతుగా విచారించగా, సర్పంచ్ పదవి కోసమే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.