Current Date: 08 Feb, 2026

ఐబొమ్మ రవికి బెయిల్‌పై వాడీవేడీగా వాదనలు.. ఎల్లుండి తీర్పు

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్‌ 'ఐబొమ్మ' నిర్వాహకుడు ఇమ్మడి రవి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. గత మూడు నెలలుగా రవి చంచల్‌గూడ జైలులోనే ఉన్నారని, ఇప్పటికే విచారణ పూర్తయినందున ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని రవి తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. రవి విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తారని ధర్మాసనానికి విన్నవించారు. అయితే, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావు ఈ బెయిల్ పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. రవికి కరేబియన్ దీవుల పౌరసత్వం ఉందని, బెయిల్ ఇస్తే అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని వాదించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ వల్ల సినీ పరిశ్రమకు భారీ నష్టం జరుగుతోందని, ఇప్పటికీ ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయని, వాటిపై పోలీసులు మరింత దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రవి పాస్‌పోర్టును పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారని, అలాంటప్పుడు విదేశాలకు పారిపోయే ప్రసక్తే లేదని రవి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. రవి పాస్‌పోర్టును సీజ్ చేశారో లేదో ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలని పీపీని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.