పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి ఆయన ఆరోగ్యంపై తరచుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యమైన షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నప్పుడు లేదా కీలకమైన రాజకీయ సమావేశాల సమయంలో ఆయనకు జ్వరం రావడం వల్ల కార్యక్రమాలు రద్దు కావడం మనం చూస్తున్నాం. తాజాగా తిరుమల లడ్డూ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ బదానం చేస్తున్న తరుణంలో.. బలంగా తిప్పి కొట్టాలని చూస్తున్న పవన్ కళ్యాణ్‌కు మళ్లీ జ్వరం వచ్చింది. దాంతో విశ్రాంతి తీసుకుంటున్నట్లు జనసేన ప్రకటించింది. పవన్ కల్యాణ్ కేవలం జ్వరంతోనే కాదు, దశాబ్ద కాలంగా వెన్నెముక సమస్యతో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వెన్నునొప్పి కారణంగానే ఆయన కొన్నిసార్లు సరిగ్గా నిలబడలేక కుర్చీలో కూలబడిపోవడం లేదా ఇంజెక్షన్లు తీసుకుని షూటింగ్స్‌లో పాల్గొనడం చేస్తుంటారు. విశ్రాంతి లేకుండా నిరంతరం ప్రయాణాలు చేయడం, సభల్లో గంటల తరబడి నిలబడి ప్రసంగించడం వల్ల ఆయన రోగనిరోధక శక్తి తగ్గి, తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారని వైద్య వర్గాల సమాచారం. అటు సినిమాలు, ఇటు రాజకీయ బాధ్యతలు.. ఇలా రెండు పడవల ప్రయాణం ఆయన శరీరంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 54 ఏళ్ల వయసులో ఉన్న పవన్, 70 ఏళ్లు దాటిన చంద్రబాబు వంటి నేతలతో పోలిస్తే త్వరగా అలసిపోతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే, ఆయన తన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని, తగిన విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆయన కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఒక రాష్ట్రానికి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడు. కాబట్టి, భవిష్యత్తులో రాజకీయంగా మరింత చురుగ్గా ఉండాలంటే పవన్ తన ఫిట్‌నెస్, హెల్త్ రూటీన్‌పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Share