ఆదాయ పన్ను శాఖ విధించిన రూ.1.50 కోట్ల జరిమానాను సవాల్ చేస్తూ తమిళ నటుడు, టీవీకే అధినేత విజయ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విజయ్ తన ఆదాయంలో రూ.15 కోట్లను వెల్లడించలేదని ఐటీ శాఖ గుర్తించింది. గతంలో 2015లో ఆయన నివాసంపై జరిగిన దాడుల్లో లభించిన పత్రాల ఆధారంగా, 'పులి' సినిమా పారితోషికంలో కొంత భాగాన్ని దాచిపెట్టినట్లు అధికారులు నిర్ధారించి ఈ జరిమానా విధించారు. కోర్టులో విజయ్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. జరిమానా ఉత్తర్వులు జారీ చేయడంలో మూడేళ్ల జాప్యం జరిగిందని, చట్టప్రకారం ఆ గడువు ముగిసిందని పేర్కొన్నారు. అయితే, ఐటీ శాఖ తరఫు న్యాయవాది ఈ వాదనను తోసిపుచ్చుతూ.. చట్టప్రకారమే జరిమానా విధించారని స్పష్టం చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి.. ఐటీ శాఖ ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని అభిప్రాయపడుతూ విజయ్ పిటిషన్‌ను కొట్టివేశారు. హైకోర్టులో చుక్కెదురైనప్పటికీ, ఈ ఉత్తర్వులను ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో సవాల్ చేసేందుకు న్యాయమూర్తి విజయ్‌కు అనుమతినిచ్చారు. దీంతో ఈ వివాదం ఇప్పుడు ట్రైబ్యునల్ ముందుకు వెళ్లనుంది. ప్రస్తుతం విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉండటం, మరోవైపు ఆయన నటించిన 'జననాయకన్' సినిమా సెన్సార్ పరంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ తీర్పు రావడం గమనార్హం.
Share