పెళ్లి భాజాలు మోగాల్సిన చోట కత్తుల వేటు పడింది. కొళ్లేగాలకు చెందిన రవీశ్ అనే యువకుడు తన వివాహ రిసెప్షన్‌కు కారులో వెళ్తుండగా, దుండగులు అడ్డగించి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రవీశ్‌ను ఆసుపత్రికి తరలించగా, కాబోయే భార్య నయన అక్కడకు వచ్చి ఏడుస్తూ పెళ్లి చేసుకుంటానని డ్రామా ఆడింది. అయితే, ఈ దాడి వెనుక ఏదో కుట్ర ఉందని అనుమానించిన రవీశ్, ఆమెను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. నయనకు దర్శన్ అనే యువకుడితో గత రెండేళ్లుగా ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి ఇష్టం లేక తన ప్రేమికుడితో కలిసి రవీశ్‌ను అంతమొందించాలని పథకం వేసినట్లు తేలింది. "నువ్వు పెళ్లి మండపానికి కాదు, స్మశానానికి వెళ్లాలి" అంటూ దర్శన్ బృందం రవీశ్‌పై దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా నయన తన ప్రేమికుడితో సంబంధాన్ని కొనసాగించిందని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు నయనతో పాటు ఆమె ప్రేమికుడు దర్శన్, మరో మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న గోకుల్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు. తనను చంపాలని చూసిన వ్యక్తితో పెళ్లి వద్దని రవీశ్ తీసుకున్న నిర్ణయం సరైనదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం రవీశ్ ఆసుపత్రిలో కోలుకుంటుండగా, కన్నడ నాట ఈ 'కిల్లర్ బ్రైడ్' ఉదంతం సంచలనంగా మారింది.