సత్యదేవ్, డాలీ ధనంజయ ప్రధాన పాత్రల్లో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం జీబ్రా. ఈ నెల 22న ఈ మూవీ విడుదల కానుంది. దీంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే, వేదికపై చిరు మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. విశాఖపట్నం నుంచి వచ్చిన ఓ మెగా అభిమాని 'బాసూ నిన్ను చూడాలని వైజాగ్ నుంచి వచ్చాను' అని గట్టిగా అరిచాడు. అది విన్న మెగాస్టార్.. ఆ అభిమానిని వైజాగ్ యాసలోనే ఆటపట్టించారు. "అయితే ఏటంటావ్ ఇప్పుడు.. నువ్వు వైజాగ్ నుంచి వచ్చినందుకు సంతోషమే.. మరి ఈ బొమ్మను నువ్వు వైజాగ్‌లో ఆడించాలి. భలేవాడివే..మన హీరోది కూడా అదే ఊరు" అంటూ చిరు ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడడంతో వేదిక మొత్తం చప్పట్లతో మారుమోగింది. అక్కడున్నవారంతా చిరంజీవి టైమింగ్‌కి నవ్వుతూ ఎంజాయ్ చేశారు.