Current Date: 01 Jul, 2026

ప్రవాస భారతీయుడి సాయంతో టీమిండియాను చిత్తుగా ఓడించిన ఐర్లాండ్

భారత్‌పై అద్భుత ప్రదర్శనతో ఐర్లాండ్ జట్టు రెండు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ చరిత్రాత్మక విజయంలో ఐర్లాండ్ ఎడమ చేతి వాటం పేసర్ జై ముంద్రా కీలక పాత్ర పోషించాడు. తొలి టీ20లో రెండు వికెట్లు తీసి పొదుపుగా బౌలింగ్ చేసిన 28 ఏళ్ల జై.. రెండో టీ20లో 3 వికెట్లతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతడు ‘ప్లేయర్‌ ఆఫ్ ద మ్యాచ్‌’తో పాటు ‘ప్లేయర్‌ ఆఫ్ ద సిరీస్‌’ అవార్డులను కూడా సొంతం చేసుకున్నాడు. ఐర్లాండ్ జట్టును గెలిపించిన జై ముంద్రా అసలు సిసలైన భారతీయుడు కావడం విశేషం. రాజస్థాన్‌లోని తోంక్‌లో జన్మించిన జై.. ఉన్నత చదువుల కోసం 2021లో ఐర్లాండ్ వెళ్లాడు. డబ్లిన్‌లోని టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కొంతకాలం ఐటీ పరిశ్రమలో ఉద్యోగం చేసినప్పటికీ, క్రికెట్‌పై ఉన్న ఇష్టంతో ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారాడు. ఇందులో భాగంగా డబ్లిన్‌లోని లీన్‌స్టర్ క్లబ్‌లో చేరి తన ప్రతిభకు పదును పెట్టుకున్నాడు.  ఈ క్రమంలోనే 2024లో ఐర్లాండ్ ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 టోర్నీలో ఆడే అవకాశం జైకి దక్కింది. 2025లో ఐరిష్ పౌరసత్వాన్ని పొందాడు. ఇటీవల టీమ్‌ఇండియాతో జరిగిన సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోని మొదటి బంతికే సంజు శాంసన్‌ను అవుట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించిన జై.. మొత్తానికి ఐర్లాండ్ చరిత్రాత్మక విజయానికి ప్రధాన కారకుడిగా నిలిచాడు.