మద్యపాన నిషేధాన్ని ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఆరుగురు బెల్టుషాపుల నిర్వాహకులకు ఒక గ్రామ సర్పంచి వినూత్నంగా షాక్ ఇచ్చారు. నిబంధనలు దాటినందుకు వారి ఇళ్లకు విద్యుత్తు సరఫరాను పూర్తిగా నిలిపివేయించారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం నష్కల్ గ్రామంలో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నష్కల్ గ్రామంలో గతంలో దాదాపు 20 బెల్ట్‌షాపులు ఉండేవి. గ్రామస్థులు, ముఖ్యంగా యువత మద్యానికి బానిసలుగా మారుతుండటంతో.. గ్రామంలో మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ గ్రామ పంచాయతీలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అయితే, వారం రోజుల క్రితం గ్రామంలో జరిగిన బొడ్రాయి వేడుకల సందర్భంగా కొందరు నిర్వాహకులు ఈ నిబంధనలను బేఖాతరు చేస్తూ దొంగచాటుగా మద్యం విక్రయాలు జరిపారు. ఈ క్రమంలో సర్పంచి శాతబోయిన రాజు గ్రామ యువకులతో కలిసి గొలుసు దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు ఆధారాలతో సహా గుర్తించడంతో, సర్పంచి ఆదేశాల మేరకు పంచాయతీ సిబ్బంది ఆరుగురు నిర్వాహకుల ఇళ్లకు కరెంట్ కనెక్షన్‌ను కట్ చేశారు. భవిష్యత్తులో మళ్లీ మద్యం అమ్మబోమని లిఖితపూర్వకంగా హామీపత్రం ఇస్తేనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని సర్పంచి స్పష్టం చేశారు.
Share