Current Date: 30 Jun, 2026

పొలంలో పంట వేస్తే బంగారం పండుతోంది.. రైతులు పోటీ!

వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం కోపాకులపాడులోని ఒక ఆరెకరాల భూమి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తమకు కౌలుకు ఇవ్వాలంటే తమకు ఇవ్వాలంటూ ఈ భూమి యజమానిని పలువురు పోటీ పడి సంప్రదిస్తున్నారు. ఇంతలా ఈ భూమికి డిమాండ్ పెరగడానికి కారణం.. అక్కడ నిజంగానే బంగారం పండుతుందని ప్రచారం జరగడమే. పదేళ్ల క్రితం చెన్నారావుపేటకు చెందిన ఒక వ్యక్తి ఈ భూమిని కొనుగోలు చేయగా, ప్రస్తుతం ఈర్యతండాకు చెందిన ఒక రైతు దీనిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 24న పొలంలో కలుపు తీయిస్తుండగా మహిళా కూలీలకు బంగారు ఆభరణాలు దొరికినట్లు గ్రామంలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న భూయజమాని కూలీలను పిలిచి విచారించగా, వారు తమకు దొరికిన బంగారు వస్తువులను చూపించారు. దీనిపై భూయజమాని వెంటనే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, గతంలో ఈ ప్రాంతంలో ప్రాచీన ఆలయాలు ఉండేవని, 1991లో అప్పటి భూయజమానికి, ఆ తర్వాత కొన్నేళ్లకు ఆ పొలంలో పనిచేసే జీతగాడికి కూడా బంగారం దొరికిందని, పూర్వం దేవతామూర్తుల విగ్రహాలు కూడా లభించాయని గ్రామస్థులు గుర్తు చేసుకుంటున్నారు.