Current Date: 06 Jul, 2024

అప్పుడు ఆ నరేంద్రుడు..ఇప్పుడీ నరేంద్రుడు!!! మళ్ళీ మోడీ ధ్యానముద్రలో..

  ప్రధాని నరేంద్ర మోడీ 2019 నుంచి ఒక కొత్త ఒరవడిని అనుసరిస్తున్నారు. రెండున్నర నెలల పాటు విపరీతంగా ప్రచారం చేయడం ఆ మీదట ఆధ్యాత్మిక క్షేత్రంలో ధ్యానముద్రలో ఉండిపోవడం. గత ఎన్నికల ప్రచారం తరువాత మోడీ ఉత్తరాదిన కేదారనాధ్ గుహలలో ధ్యానం చేశారు. అలా ఆయన మూడు రోజుల పాటు చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 304 సీట్లు సాధించింది. ఎన్డీయే కూటమి తో కలుపుకుంటే 330 దాకా సీట్లు దక్కాయి. అలా మోడీ ధ్యానం తో ఇహం పరం రెండూ సాధించారు. ఈసారి కూడా ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్తున్నారు. కానీ ఈసారి ఆయన దక్షిణ దిక్కున ధ్యాన దీక్ష తీసుకుంటున్నారు.  ఆయన ఈ నెల 30న గురువారం తమిళనాడుకు వస్తారు. అక్కడ నుంచి కన్యాకుమారి కి వెళ్తారు. వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శిస్తారు. వివేకానంద రాక్ వద్ద మే 30 నుంచి జూన్ 1 సాయంత్రం వరకూ మూడు రోజుల పాటు మోడీ ధ్యానం చేస్తారు. గతంలో వివేకానందుడు ఇక్కడే ధ్యానం చేశారు. సరిగ్గా ఆ ప్రాంతాన్ని మోడీ ఎంచుకుంటున్నారు. మోడీ ఈసారి కూడా ధ్యానంలో కఠిన నిబంధనలు అనుసరించనున్నారు. ఆ మూడు రోజులూ ఆయన శ్వాస మీద దృష్టి పెట్టి ఉంటారు. ఈ కఠోరమైన దీక్ష తరువాత ఆయన జూన్ 1వ తేదీ సాయంత్రం మాత్రమే తిరిగి ఐహిక ప్రపంచంలోకి వస్తారు. ఒక విధంగా ఇది మోడీ మార్క్ ట్రెండ్. ఆయన ధ్యానానికి ఎంతో శక్తి ఉంది అని అంటారు. దేశంలో ఈసారి బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీయేకు 400 సీట్లు టార్గెట్ గా మోడీ పెట్టుకున్నారు. దాంతో వాటిని సాధించగలమని ఆయన బలంగా నమ్ముతున్నారు. జూన్ 1వ తేదీ సాయంత్రం తో చివరి విడత పోలింగ్ పూర్తి అవుతుంది. అదే రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు టీవీ చానళ్లలో ప్రారంభం అవుతాయి. మరి జూన్ 4 ఫలితాల కంటే ముందే మూడ్ ఆఫ్ ది నేషన్ ఏంటో అవి తెలియచేస్తాయి. అలా మోడీ ధ్యాన ముద్రను విడిచిన తరువాత తొలి ఫలితం ఎలా ఉంటుందో కూడా స్వయంగా చూస్తారు అన్న మాట.