హైదరాబాద్ నగర పరిధిలోని.. చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేతే లక్ష్యంగా హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్న విషయం తెలిసిందే. అయితే.. చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను హైడ్రా నిర్ధాక్షిణ్యంగా కూల్చివేయటం సర్వత్రా విమర్శలకు తెరలేపిన విషయం తెలిసిందే. హైడ్రా సంస్థకు కమిషనర్‌గా వ్యవహరిస్తున్న ఏపీ రంగనాథ్ ఇల్లు కూడా బఫర్ జోన్‌లోనే ఉందని.. అందుకు ఆధారాలు కూడా బయటపెట్టారు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్. యూసుఫ్‌గూడలోని కృష్ణకాంత్ పార్క్ దగ్గరలోనే హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఇల్లు ఉందని తెలిపిన బక్కా జడ్సన్.. అది చెరువు బఫర్ జోన్ పరిధిలోకే వస్తుందని వివరించారు. అయితే.. ప్రస్తుతం కృష్ణకాంత్ పార్కు ఉన్న ప్రాంతం ఒకప్పుడు పెద్ద చెరువు అని.. చంద్రబాబు హయాంలో చెరువును పూడ్చేసి పార్కు నిర్మించారని చెప్పుకొచ్చారు. 2 నెలలు కష్టపడి వందేళ్ల నాటి మ్యాప్ సేకరించినట్టు తెలిపిన జడ్సన్.. వెంగళరావునగర్‌లో రంగనాథ్ నివసిస్తున్న ప్రస్తుత ఇల్లు.. పెద్ద చెరువు బఫర్ జోన్‌లోనే ఉందని.. వివరించారు. అందుకు ఆధారమే వందేళ్ల నాటి మ్యాప్ అని చెప్పుకొచ్చారు.