ఏపీలో పోలింగ్ గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచార వేడి ఉధృతంగా కొనసాగుతోంది. అన్ని పార్టీలు తమ ప్రచార కార్యక్రమాల తీవ్రతను పెంచాయి. అదే సమయంలో నామినేషన్ల పర్వం కూడా జోరెత్తింది. మూడొంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్లను దాఖలు చేయడానికి ఈ నెల 25వ తేదీ తుది గడువు.
నామిషన్లను వేయడానికి ఇంకో రెండు రోజులే మిగిలివుంది. ఇప్పటికే సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబు, నారా లోకేష్ తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇక టాప్ రాజకీయ నాయకుల్లో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. కాకినాడ జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన బరిలో నిలిచిన విషయం తెలిసిందే.
2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. భీమవరం, గాజువక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఓటమిపాలయ్యారు. ఇప్పుడు పిఠాపురం రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ నామినేషన్‌లో పొందుపరిచే అంశాల గురించి కౌంటర్ చేయడానికి వైసీపీ సిద్ధమవుతోంది. మరీ ముఖ్యంగా.. సతీమణి పేరు, ఆదాయం, ఆస్తులపై పవన్‌ను టార్గెట్ చేసే అవకాశం ఉంది.