వైసీపీ ఘోర పరాజయం తర్వాత ఇన్నాళ్లు మౌనంగా ఉన్న నేతలు బయటికి వచ్చి వరుసగా మాట్లాడుతున్నారు. ఈ క్రమంలో సీఎంవోపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. జగన్‌ను కలవాలంటే సీఎంఓ అడ్డుపడేదని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. జగన్‌ను కలవనీయకుండా సీఎంఓ అడ్డుగా నిలిచి దూరం పెట్టిందని, దీంతో ప్రజాప్రతినిధులు సమస్యలు ఆయనకు చెప్పుకోలేకపోయారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు. జక్కంపూడి రాజా కూడా ఇటీవల ఇదే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.మేనిఫెస్టోపై జగన్ ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారని, రుణమాఫీ హామీ ఇస్తారని అంతా భావించారన్నారు. పెన్షన్ పెంచుతూపోతానని చెప్పి ఉంటే బాగుండేదని.. చంద్రబాబు 50 ఏళ్లకే రూ.4 వేలు పింఛను ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం దెబ్బకొట్టిందన్నారు.ఎన్నికల ఫలితాలపై తాను నిరాశ చెందానని, తనను కలిసేందుకు ఎవరూ ప్రయత్నించ వద్దని, తాను కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తున్నట్లు చెప్పారు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హడావుడి చేసిన కేతిరెడ్డి చిత్తుగా ఓడిపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.