Current Date: 26 Nov, 2024

దివ్యాంగుల క్రికెట్‌కు ఏసీపీ ప్రోత్సాహం

ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) సహకారంతో ఆంధ్రా క్రికెట్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ డిజేబుల్డ్‌ ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న దివ్యాంగుల అంతర్‌ జిల్లా క్రికెట్‌ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. విశాఖలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభమైన ఈ టోర్నీ సందర్భంగా ఏసీఏ జనరల్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఎస్‌ఎంఎన్‌ రోహిత్‌ వర్మ మాట్లాడుతూ దివ్యాంగులను క్రికెట్‌ పరంగా ప్రోత్సహించేందుకు వీలుగా మ్యాచ్‌ నిర్వహణ కోసం ఏసీఏ అధ్యక్షులు పి.శరత్‌ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్సార్‌ గోపీినాథ్‌రెడ్డి క్రీడాకారులకు వసతి, భోజనంతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు కల్పించారన్నారు. ఆటగాళ్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. ఏసీఏ విభిన్న ప్రతిభావంతుల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌ యడ్లపల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా తొలి సారి దివ్యాంగుల కోసం టోర్నమెంట్‌ నిర్వహించడంపై ఏసీఏను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఏసీఏ విభిన్న ప్రతిభావంతుల క్రికెట్‌ కమిటీ సభ్యులు ఎస్‌.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Share