Current Date: 26 Nov, 2024

లగ్జరీ వాచీల స్మగ్లింగ్‌లో దొరికిపోయిన మంత్రి కొడుకు!

తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు హర్షారెడ్డి వివాదంలో ఇరుక్కున్నారు. స్మగుల్డ్‌ గూడ్స్‌‌కు సంబంధించిన కేసులో హర్షారెడ్డికి చెన్నై కస్టమ్స్‌ అధికారులు  ఏప్రిల్‌ 4న విచారణకి రావాలని నోటీసులు జారీ చేశారు.  అయితే ప్రస్తుతం తనకి ఆరోగ్యం బాలేదని ఏప్రిల్ 27 తర్వాత విచారణకు హాజరవుతానని పొంగులేటి హర్షా రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

హర్షా రెడ్డి కోసం సింగపూర్‌ నుంచి 2 వాచ్‌లు ముబిన్‌ అనే స్మగ్లర్‌ తెప్పించాడు. పటెక్‌ ఫిలిప్‌, బ్రిగెట్‌ బ్రాండ్‌ల లగ్జరీ వాచ్‌లను హర్ష ఆర్డర్ చేశారు. భారత్‌లో దొరకని ఈ బ్రాండ్లను హర్ష కోసం తెచ్చాడు ముబిన్‌. కానీ.. చెన్నై విమానాశ్రయంలో ముబిన్‌ నుంచి రెండు వాచ్‌లు స్వాధీనం చేసుకున్న కస్టమ్స్‌ అధికారులు ఈ కేసుపై విచారణకి రావాలని హర్షా రెడ్డికి నోటీసులు జారీ చేశారు.

హర్షా కోసం తెచ్చిన వాచీల్లో ఒక్కో వాచ్ ఖరీదు రూ.1.75 కోట్లు ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. ఈ వాచ్‌లకు హవాలా రూపంలో డబ్బు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ముబిన్, హర్షారెడ్డికి నవీన్ కుమార్ అనే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నవీన్ కుమార్‌ని విచారించారు కస్టమ్స్ అధికారులు ఈ నెల చివర్లో హర్షా రెడ్డిని కూడా విచారించబోతున్నారు.