Current Date: 12 Feb, 2026

భారత్‌తో మ్యాచ్ ఆడతాం.. వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ యూ టర్న్

బంగ్లాదేశ్‌కు మద్దతుగా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామని భీషణ ప్రతిజ్ఞలు చేసిన పాకిస్థాన్, ఆఖరికి వెనక్కి తగ్గక తప్పలేదు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న కొలంబో వేదికగా భారత్‌తో జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్‌లో తలపడతామని పాక్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచంలో గందరగోళం సృష్టించిన పీసీబీ, ఐసీసీ హెచ్చరికలు, అంతర్జాతీయ ఒత్తిడితో చివరకు తన పంతాన్ని వీడి ‘యు-టర్న్’ తీసుకుంది. ఇది క్రికెట్ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయమని పైకి చెబుతున్నా, అసలు కారణం మాత్రం ఆర్థిక, దౌత్యపరమైన ఒత్తిళ్లేనని స్పష్టమవుతోంది. ఈ నిర్ణయం వెనుక రూ. 4,500 కోట్లకు పైగా ఉన్న మ్యాచ్ వాణిజ్య విలువ ప్రధాన పాత్ర పోషించింది. భారత్-పాక్ మ్యాచ్ రద్దయితే ఐసీసీతో పాటు సభ్య దేశాలన్నీ భారీగా ఆదాయం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. దీనికి తోడు, మ్యాచ్ జరగకపోతే పీసీబీపై భారీ ఆర్థిక జరిమానాలు విధిస్తామని, భవిష్యత్తులో వాణిజ్యపరంగా ఏకాకిని చేస్తామని ఐసీసీ హెచ్చరించడం పాక్‌ను ఆత్మరక్షణలో పడేసింది. బంగ్లాదేశ్‌పై ఐసీసీ ఎలాంటి ఆంక్షలు విధించబోమని హామీ ఇవ్వడంతో, పాకిస్థాన్ గౌరవప్రదంగా వెనక్కి తగ్గడానికి ఒక సాకు దొరికినట్లయింది. ఈ సంక్షోభం తొలగడంలో శ్రీలంక దౌత్యం కీలకమైంది. ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార స్వయంగా పాక్ ప్రధాని షరీఫ్‌తో మాట్లాడటంతో పాటు, 2009లో పాక్ క్రికెట్ కష్టాల్లో ఉన్నప్పుడు తాము అండగా నిలిచిన విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు గుర్తు చేసింది. మరోవైపు, భారత్‌తో ఆడితేనే తమకు ఆర్థికంగా మేలు జరుగుతుందని బంగ్లాదేశ్ కూడా విన్నవించడంతో పాక్ మెడలు వంచక తప్పలేదు. ఎప్పటిలాగే ముందు ప్రగల్భాలు పలికి, ఆ తర్వాత పరిస్థితులకు తలవంచడం పాకిస్థాన్ క్రికెట్ పాలకులకు అలవాటేనని ఈ పరిణామంతో మరోసారి నిరూపితమైంది.