Current Date: 26 Nov, 2024

చెరువుకుంటలో రేవంత్ రెడ్డి ఇల్లు హైడ్రాకి ప్రూప్స్‌తో చెప్పిన హరీశ్ రావు

హైడ్రా కూల్చివేతలపై మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసే పనులకు హస్తం గుర్తు తీసేసి బుల్డోజర్‌ గుర్తు పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ హైదర్‌షాకోట్‌లో మూసీ, హైడ్రా బాధితుల ఇండ్లను ఎమ్మెల్యేలు హరీశ్‌, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని పలువురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. కొడంగల్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి కట్టుకున్న ఇల్లు చెరువు కుంటలో ఉందని సంచలన కామెంట్స్ చేశారు. ఆయన తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉందని వాటిని కూల్చి ఆ తర్వాత పేదల ఇండ్ల జోలికి రావాలన్నారు. రేవంత్ రెడ్డి ఏదో శుద్దపూసలెక్క మాట్లాడుతుండు. కొండగల్‌లో ఆయన కట్టుకున్న ఇల్లే చెరువు కుంటల ఉన్నది. రెడ్డి కుంటలో సర్వే నెంబర్ 1138లో రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది. ఫస్టు నీ ఇల్లు కూలగొట్టుకో నీ ఇల్లు రెడ్డి కుంటల.. నీ తమ్ముడి ఇల్లు ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నది. నీ తమ్మునికో రూల్.. నీకో రూల్.. గరీబోళ్లకో రూలా..? అని హరీష్ రావు తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. మూసీని ఆక్రమించి భవనాలు కట్టినవారిని అడ్డుకోవట్లేదని.. పేదల ఇండ్లపైకి మాత్రం బుల్డోజర్లు పంపిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో పాలనను వదలేసి.. ఈ బుల్డోజర్‌ రాజకీయాలేంటని ప్రశ్నించారు. కూల్చివేతలను ఉపేక్షించేంది లేదని.. అవసరమైతే బుల్డోజర్లకు అడ్డంగా ఉంటామని హెచ్చరించారు.

Share