Current Date: 30 Sep, 2024

కాన్పూర్ టెస్టుని వదలని వరుణుడు.. డ్రా అయితే భారత్‌కే నష్టం

కాన్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌ మధ్య జరుగుతున్న  రెండో టెస్టును ప్రతికూల పరిస్థితులు వెంటాడుతూనే ఉన్నాయి. తొలి రోజైన శుక్రవారం 35 ఓవర్ల ఆట జరిగింది. కానీ ఆ తర్వాత వరుసగా శనివారం, ఆదివారం వర్షం, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో ఒక్క బంతి కూడా పడకుండానే ఆటని అంపైర్లు రద్దు చేశారు. మరి సోమవారం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మ్యాచ్‌లో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. కానీ ఈ రెండు రోజులు ఆట సాగినా టెస్టు డ్రాగా ముగిసే అవకాశాలే చాలా ఎక్కువ. బంగ్లా తొలి రోజు 35 ఓవర్లలో 107/3తో నిలిచిన సంగతి తెలిసిందే. వర్షం వల్ల వరుసగా రెండు రోజులు ఆట తుడిచిపెట్టుకుపోయింది. తొలి టెస్టులో 280 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన టీమ్‌ఇండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. వాస్తవానికి ఈ మ్యాచ్‌లోనూ భారత్ జట్టు సులువుగా గెలిచే అవకాశం ఉంది. కానీ మ్యాచ్ డ్రా అయితే.. బంగ్లాదేశ్‌తో కలిసి పాయింట్లని భారత్ పంచుకోవాల్సి వస్తుంది. మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 12 పాయింట్లు వస్తాయి. కానీ.. డ్రా అయితే బంగ్లాదేశ్, భారత్‌కి నాలుగేసి పాయింట్ల చొప్పున మాత్రమే వస్తాయి.

Share