Current Date: 30 Sep, 2024

దీపావళి నుంచి ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం అమలు.. ఏపీ ప్రభుత్వం కసరత్తు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులైనా సూపర్-6 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయడం లేదని వైయస్‌ఆర్‌సీపీ విమర్శిస్తోంది. ఇప్పటికే పింఛన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్న క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలను అమలు చేసినా.. అవేవీ సూపర్-6లో భాగం కాదు. కాబట్టి.. టీడీపీ కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే దీపావళి నుంచి మరో పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మహాశక్తి పథకంలో భాగంగా ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభిస్తారు. ఈ విషయాన్ని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825.50 గా ఉంది. ఒక్కో కుటుంబానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తే.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.2,476.50 ప్రయోజనం లభిస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కోటీ 55 లక్షలకుపైగా వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీరికి అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తే.. ఏడాదికి రూ.3,640 కోట్లు కావాల్సి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీపం పథకాన్ని ఉజ్వల కిందకు చేర్చితే 65 లక్షల కనెక్షన్లు ఉజ్వల పథకం కిందకు వస్తాయి. ఉజ్వల పథకం లబ్ధిదారులకు కేంద్రం సిలిండర్ మీద రూ.300 రాయితీ ఇస్తుంది. దాంతో ఖజానాపై భారం తగ్గుతుంది.

Share