Current Date: 27 Nov, 2024

ట్రాక్‌మెన్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం ట్రైన్‌ను ఎలా ఆపాడంటే?

అర్ధరాత్రి కుండపోత వర్షంలోనూ రెప్ప వేయకుండా ఇద్దరు ట్రాక్‌మెన్‌లు అప్రమత్తంగా వ్యవహరించడంతో తెలంగాణలోని మహబూబాబాద్‌ రైల్వే  స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. కేసముద్రం-ఇంటికన్నె రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్‌మెన్‌ గుగులోత్‌ మోహన్‌ నైట్‌ వాచ్‌మెన్‌గా రాత్రి విధులు నిర్వహిస్తున్నారు.రాత్రి 12 గంటల సమయంలో ఒకసారి, 2 గంటల సమయంలో మరోసారి నీటి ప్రవాహం భారీగా పెరగడంతో మోహన్‌ ఈ విషయాన్ని సెక్షన్‌ ఇంజినీర్లకు చేరవేశారు. దీంతో వారు రైళ్ల వేగాన్ని తగ్గించారు. అదే సమయంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంటికన్నె మీదుగా కేసముద్రం చేరుకుంది. రాత్రి 2.30 గంటల సమయంలో వరద ప్రవాహం ఉద్ధృతంగా మారి ట్రాక్‌ తెగిపోయింది.మోహన్‌ ఇంటికన్నె వైపు ఉన్నారు. వరంగల్‌ నుంచి వచ్చే రైళ్లను నిలిపేందుకు ట్రాక్‌పై 30 మీటర్ల దూరం వెళ్లి పట్టాల మధ్యలో ఎరుపు రంగు లైట్‌ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మరో 60 మీటర్ల దూరం వెళ్లి ట్రాక్‌పై పట్టా కడ్డీలు ఏర్పాటుచేశారు. రైలు పట్టా కడ్డీ పైనుంచి వెళ్లినప్పుడు పేలుడు శబ్దం వస్తుంది. దీంతో లోకోపైలట్‌.. ముందు ప్రమాదం ఉందని గమనించి రైలును నిలిపివేశారు. దాంతో పెనుప్రమాదం తప్పింది.

Share