Current Date: 02 Oct, 2024

సముద్రం ఒడ్డున సి ఆర్ జెడ్ ను ఉల్లంఘించి నిర్మాణం

వైసీపీ అధికారంలో ఉండగా విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో
సి ఆర్ జెడ్ ఉల్లంఘనలంటూ కూల్చి వేతలకు  తెర లేపిన అప్పటి ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జి రాజ్యసభ సభ్యుడు విజయ సాయి రెడ్డి చివరికి అదే ఊబిలో  చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. తన కుమార్తె నేహా రెడ్డి పేరిట భీమిలిలో సి ఆర్ జెడ్ నిబంధనలను ఉల్లంఘించి సముద్రం ఒడ్డున కట్టిన కాంక్రీట్ గోడలను జీవీఎంసీ అధికారులు బుధవారం తొలగించారు.కోస్తా నియంత్రణ మండలి( సి ఆర్ జెడ్) నిబంధనలను ఉల్లంఘించి విజయసాయి రెడ్డి వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై జనసేన కార్పోరేటర్ పీతలమూర్తి యాదవ్ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యం దాఖలు చేశారు ‌. విచారణ సమయంలో తమకు రక్షణ కల్పించాలంటూ విజయ సాయి రెడ్డి కుమార్తె నేహా రెడ్డి కూడా పిటిషన్ వేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు మహావిశాఖ నగరపాలక సంస్థ అభిప్రాయాన్ని కోరింది. కట్టడం నిబంధనలకు విరుద్ధమని జీవీఎంసీ హైకోర్టుకు స్పష్టం చేయడంతో 15 రోజుల్లో చర్యలు తీసుకొని తమకు తెలియజేయాలని ఆదేశించింది. దీంతో జీవీఎంసీ అధికారులు బుధవారం ఉదయం జెసీబీ ల సాయంతో అక్రమ కాంక్రీట్ గోడలను కూల్చివేశారు. 
 

Share