Current Date: 02 Oct, 2024

ఆస్తిని తీసుకుని తండ్రిని పట్టించుకోని కొడుకుకి కలెక్టర్ గుణపాఠం

 తండ్రిని పట్టించుకోని కొడుకుకి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష దిమ్మతిరిగేలా గుణపాఠం నేర్పారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పైడిచింతలపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాపురెడ్డి తన కుమారుడైన గడ్డం స్వామిరెడ్డికి వివిధ సర్వే నంబర్లలోని తనకున్న 6 ఎకరాల 5 గుంటల భూమిని గిఫ్ట్ డీడ్ చేశారు. అయితే.. జీవితంలో స్థిరపడిన ఆ కుమారుడు మాత్రం.. తనకు అన్నీ చేకూర్చిన తండ్రి బాగోగులు మాత్రం కొంతకాలంగా చూసుకోవట్లేదు.   ఎవరి మీద ఆధారపడకుండా బతుకుదామనుకుంటే.. ఉన్నదంతా కొడుకుకే రాసిచ్చేయటంతో.. ఆ తండ్రికి వేరే దారి లేకుండా పోయింది. దీంతో.. తన బాగోగులు చూసుకోవట్లేదని కొడుకుపై పెద్దపల్లి ఆర్డీవోకు బాపురెడ్డి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ తండ్రి ఇచ్చిన విచారణ చేపట్టిన ఆర్డీవో.. స్వామిరెడ్డికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా కొడుకు ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో విసిగిపోయిన బాపురెడ్డి గతంలో తన కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్‌ను రద్దు చేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.   విచారణ జరిపిన కలెక్టర్ కోయ శ్రీహర్ష.. వయోవృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం గడ్డం బాపురెడ్డి కొడుకు పేరిట చేసిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి తిరిగి తండ్రి పేరిట బదిలీ చేయాలని నిర్ణయించారు. 

Share