కాకినాడ జిల్లా పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవం శనివారం ఘనంగా జరిగింది. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న వార్షిక కళ్యాణ మహోత్సవం మొదటి రోజుకు పెళ్లి పెద్దలుగా శ్రీ సీతారాములు వ్యవహరించగా, వారి సమక్షంలో రత్నాద్రి వాసులైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో స్వామివారిని పెండ్లి కుమారుని చేశారు. ముందుగా ఆలయ అర్చకులు గర్భాలయంలో ఉన్న శ్రీ స్వామి అమ్మవారిని, రామాలయంలో ఉన్న శ్రీ సీతారాములవారిని మంగళ వాయిద్యాలు నడుమ తోడుకొని వచ్చి అనివేటి మండపంలోని వెండి సింహాసనంపై శ్రీ స్వామి అమ్మవార్లను, సీతారాములని ఆసీనులు గావించి వివిధ రకముల సుగంధ భరితమైన పుష్పములతో అలంకరించి విగ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం స్వామిని పెళ్ళికొడుకు చేసి, తర్వాత ఏడు గంటలకు ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరిపారు. ఈ మహోత్సవంలో దేవస్థానం చైర్మన్ ఐవి రోహిత్, దేవస్థానం కార్య నిర్వాహణాధికారి కోడూరి రామచంద్ర మోహన్, దేవస్థానం అధికారులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.