ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకి మద్దతు తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి.రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్)లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ దిశగా అడుగులు వేస్తున్న కేంద్రానికి టీడీపీ, జనసేన మద్దతు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సెంట్రల్‌లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి టీడీపీ మద్దతుగా ఉంది. ఇప్పుడు అదే మద్దతుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కూడా కొనసాగిస్తే.. ఏళ్ల తరబడి నానుతున్న సమస్యకి పరిష్కారం దొరికినట్లవుతుందని టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక శాసన సభ్యుడు పల్లా శ్రీనివాస్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నిలుపు చేస్తామని ఎన్నికల ముందు, తరువాత కూడా గట్టిగా చెబుతున్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్ కూడా ప్రైవేటీకరణ జరగనివ్వమని చెబుతున్నారు.కేంద్రం వైఖరి వల్ల విశాఖ ఉక్కు ఆర్ధికంగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. టీడీపీ, జనసేన కూటమి మద్దతుతో కేంద్రం లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ విశాఖ ఉక్కుకు ఏ మాత్రం సాయం చేయడం లేదు. పైగా ప్రైవేటీ కరణనను వేగవంతం చేస్తోందని వార్తలు వస్తున్నాయి.