ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌లోనూ ఈసారి రాష్ట్రంలో అధికారం ఎవరికి దక్కనుందనే అంశంపై మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన అధికార వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్లపై సీల్, హోదా వివరాల విషయంలో వైసీపీ వాదనతో హైకోర్టు విభేదిస్తూ కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రంలో ఈసారి నమోదైన పోస్టల్ బ్యాలెట్ల డిక్లరేషన్ పై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వివరాలు అక్కర్లేదంటూ ఈసీ గతంలో నిర్ణయం తీసుకుంది. దీనిపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఏపీలో మాత్రమే ఈ వెసులుబాటు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. అయితే దీనిపై నిన్న వాదనలు విన్న హైకోర్టు తీర్పును మాత్రం ఈరోజుకి రిజర్వు చేసింది. ఈరోజు సాయంత్రం పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటుపై హైకోర్టు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్ పై ఆర్వో సంతకం ఉంటే సరిపోతుందని, సీల్, హోదా వివరాలు లేకపోయినా చెల్లుబాటు అవుతుందంటూ ఈసీ చేసిన వాదనతో హైకోర్టు ఏకీభవించింది. దీంతో వైసీపీ పిటిషన్ ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ఈసారి ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ మరింత పెరిగినట్లయింది. జూన్ 4న వెలువడే ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎటు మొగ్గాయన్న దానిపై పలు చోట్ల ఫలితాలు తారుమారు అయినా ఆశ్చర్యం లేదు.