Current Date: 24 Jun, 2026

ఎమ్మెల్యే కొడుకుకి సీఎం విజయ్ నామకరణం.. ఏం పేరు పెట్టాడో తెలుసా?

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. తిరువిక నగర్ ఎమ్మెల్యే పల్లవి కుమారుడికి నామకరణం చేశారు. శాసనసభ కార్యక్రమాలు ముగించుకుని సచివాలయం నుంచి ఇంటికి బయలుదేరుతున్న ముఖ్యమంత్రిని ఎమ్మెల్యే పల్లవి తన చంటిబిడ్డతో కలిసి కలుసుకున్నారు. ఈ సందర్భంగా విజయ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, తన బిడ్డకు పేరు పెట్టాల్సిందిగా ఆమె కోరారు. ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ పసిబిడ్డను చేతుల్లోకి తీసుకున్న ముఖ్యమంత్రి విజయ్ ఆ బాలుడికి ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని నామకరణం చేశారు. దీనిపై మీడియా ప్రతినిధులతో పల్లవి మాట్లాడుతూ.. విజయ్ నటించిన ‘జననాయగన్‌’ చిత్రంలో ఆయన పాత్ర పేరు ‘వెట్రి కొండాన్‌’ అని, దానిని స్ఫూర్తిగా తీసుకుని తన బిడ్డకు ‘తమిళ్‌ వెట్రి కొండాన్‌’ అని పేరు పెట్టారని ఆనందం వ్యక్తం చేశారు. ఇకపై ఈ బిడ్డను సంక్షిప్తంగా 'టీవీకే' అని పిలుచుకుంటామని ఆమె తెలిపారు. తన బిడ్డకు ముఖ్యమంత్రి విజయ్ చేతుల మీదుగా నామకరణం చేయించాలనే కల ఇప్పుడు నెరవేరిందని, ఇది తనకు అమితానందాన్ని కలిగించిందని పల్లవి పేర్కొన్నారు.