వైసీసీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రాజకీయ జీవితం అనిశ్చితిలో పడిపోయింది. రెండు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో వివాదాలు.. మరెన్నో విమర్శలు ఎదుర్కొంటూ 2021లో ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగుపెట్టారు. అయితే, ఆయన వ్యక్తిగత వ్యవహారాలు సొంత పార్టీకే ఇబ్బందిగా మారడంతో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీ పదవీ కాలం మరో ఏడాది ఉన్నప్పటికీ, వైసీపీలో ధర్మాన సోదరులతో పెట్టుకున్న విభేదాల వల్ల పార్టీలోకి రీఎంట్రీ అసాధ్యంగా కనిపిస్తోంది. మరోవైపు కూటమి నేతల నుంచి కూడా దువ్వాడకి ఛీత్కారాలే ఎదురవుతున్నాయి. పవన్ కళ్యాణ్‌పై గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో టెక్కలి పోలీసులు ఆయనను పిలిపించి విచారించారు. ఈ సందర్భంగా టెక్కలి పోలీస్ స్టేషన్ వద్ద దువ్వాడ స్నేహితురాలు దివ్వెల మాధురితో పాటు ఆయన అనుచరులు హడావుడి చేశారు. ఈ విచారణ వెనుక మంత్రి అచ్చెన్నాయుడు హస్తం ఉందని పెద్ద ఎత్తున ఆరోపించారు. దాంతో ఆయన టీడీపీలో చేరడానికి దారులు మూసుకుపోయాయి. పవన్ కళ్యాణ్‌ను తిట్టిన కేసులోనే దువ్వాడ విచారణకు రావడంతో.. జనసేన పార్టీ డోర్స్ క్లోజ్. ఈ రెండు పార్టీలను కాదనుకుని.. బీజేపీ చేర్చుకోవడానికి కూడా సిద్ధం లేదు. దాంతో ప్రస్తుతం ఏ ప్రధాన పార్టీ కూడా ఆయనను చేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో, ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఫైర్‌బ్రాండ్ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర అనిశ్చితిలో పడిపోయింది.