Current Date: 24 Jun, 2026

టికెట్ రేట్లపై నోరుజారిన రామ్‌చరణ్.. ఉతికారేస్తున్న నెటిజన్లు

మెగా హీరో రామ్ చరణ్ ఢిల్లీలో జరిగిన ఓ న్యూస్ ఛానెల్ సమ్మిట్‌లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి. భారతదేశంలో సినిమానే అత్యంత చవకైన వినోద సాధనమని పేర్కొన్న ఆయన, థియేటర్ అనుభవం మరింత మెరుగ్గా ఉండాలంటే మల్టీప్లెక్స్‌లలో పాప్‌కార్న్, తినుబండారాల ధరలను తగ్గించాలని సూచించారు. అలాగే తన లేటెస్ట్ మూవీ 'పెద్ది' రూ.450 కోట్ల వసూళ్లు సాధించడంలో, 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ రావడంలో ఓటీటీల పాత్ర కీలకమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పాప్‌కార్న్ ధరలు తగ్గించాలన్న చరణ్ సూచనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం మూడు వారాల క్రితం విడుదలైన 'పెద్ది' సినిమా కోసమే భారీ బడ్జెట్ నెపంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాల నుండి అనుమతులు తెచ్చుకున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఒకవైపు సినిమా టికెట్ ధరలను భారీగా పెంచేస్తూ, మరోవైపు సినిమా చవకైన ఎంటర్‌టైన్‌మెంట్ అనడం రియాలిటీకి దూరంగా ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మ్యూజిక్ కన్సర్ట్స్, క్రికెట్ మ్యాచ్‌లతో పోలిస్తే సినిమా టికెట్లు తక్కువైనా.. ఏడాది ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ధరలతో పోలిస్తే థియేటర్ ఖర్చు చాలా ఎక్కువని నెటిజన్లు పేర్కొంటున్నారు. భారీ సినిమాలకు తోడవుతున్న బెనిఫిట్ షో రేట్లు, ప్రీమియం చార్జీల వల్ల సాధారణ కుటుంబాలు థియేటర్లకు వెళ్లడమే భారం అయిపోయిందని, అందుకే చాలామంది ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారని అభిప్రాయపడుతున్నారు.