Current Date: 07 Jul, 2026

సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో బస్సుని నడిపిన డ్రైవర్.. ప్రయాణికులు బెంబేలు!

మనం సెల్‌ఫోన్ టార్చ్ వెలుగులో నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటాం. అలాంటిది కర్ణాటక రాష్ట్రంలో ఏకంగా ఆర్టీసీ బస్సుని ఆ వెలుగులో నడిపి ఓ డ్రైవర్ ఆశ్చర్యపరిచాడు. కలబురగి నుండి చించోళి మధ్య నడుస్తున్న ప్రభుత్వ ఆర్టీసీ బస్సు హెడ్‌లైట్లు అకస్మాత్తుగా పనిచేయడం మానేశాయి. దట్టమైన చీకట్లో ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడానికి డ్రైవర్, కండక్టర్లు ఒక వింత ఉపాయాన్ని ఆలోచించారు. కండక్టర్ తన సెల్‌ఫోన్‌లోని టార్చ్‌లైటును ఆన్ చేసి బస్సు ముందుభాగం నుండి వెలుతురును చూపించగా, ఆ మొబైల్ వెలుగు ఆధారంగానే డ్రైవరు అత్యంత ప్రమాదకరమైన రీతిలో బస్సును నడిపారు. ఈ వింత ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలను బస్సులోని కొందరు ప్రయాణికులు వీడియో తీయడంతో, అది కాస్తా సోషల్ మీడియా విపరీతంగా వైరల్‌గా మారింది. రాత్రి వేళలో ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి, కనీసం హెడ్‌లైట్లు కూడా లేని బస్సును రోడ్డుపైకి ఎలా అనుమతించారంటూ నెటిజన్లు రవాణా శాఖ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 84 కిలోమీటర్ల మేర సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సిన ఆర్టీసీ బస్సు కనీస సౌకర్యాలు లేకుండా నడవడంపై ప్రయాణికులు భయాందోళనలు వ్యక్తం చేశారు.