Current Date: 07 Jul, 2026

అరసవల్లి హుండీ లెక్కింపులో వాలంటీర్ చేతివాటం.. ఏం ఐడియా గురూ!

శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో దొంగతనం చేస్తూ వాలంటీర్ దొరికిపోయాడు. విజయనగరం ప్రాంతం నుండి గత ఆరు నెలలుగా కొందరు సభ్యులు ఒక బృందంగా వచ్చి ఇక్కడ హుండీ లెక్కింపు సేవలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం కూడా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుండగా ఈ చోరీ ఉదంతం వెలుగుచూసింది. ఆలయ ఈవో తెలిపిన వివరాల ప్రకారం.. సదరు లెక్కింపు బృందానికి చెందిన విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొచ్చపేట నివాసి బి.కృష్ణారావు అనే వాలంటీరు ఎవరికీ అనుమానం రాకుండా కొత్త ప్లాన్ వేశాడు. ఆయన తన కాలి వేళ్లకు రబ్బరు బ్యాండ్లు చుట్టుకుని, వాటి మధ్యలో రూ.500 నోట్లను అమర్చాడు. ఈ విధంగా మొత్తం 23 నోట్లను (రూ.11,500) కాజేసి, లెక్కింపు మధ్యలో వాష్ రూమ్‌కు వెళ్తానంటూ అనివెట్టి మండపం నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ.. కృష్ణారావు బయటకు వస్తున్న సమయంలో ఆయన కాలి వేళ్ల నుండి 3 ఐదు వందల నోట్లు ఒక్కసారిగా కిందపడిపోయాయి. దీనిని గమనించిన ఆలయ సిబ్బంది తక్షణమే అప్రమత్తమై అతనిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా, రూ.11,500 చోరీ చేసినట్లు నిర్ధారణ అయింది. దీనిపై ఆలయ ఈవో ప్రసాద్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.