Current Date: 06 Jul, 2026

పద్మశ్రీపై నోరుజారిన రాజేంద్రప్రసాద్.. గంటల వ్యవధిలో కవరింగ్!

టాలీవుడ్ సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గతంలో చేసిన ‘అవార్డులు రావడానికి ఎన్నో దారులు ఉంటాయి’ అనే వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికరంగా స్పందించారు. చిరంజీవి ఆ వ్యాఖ్యలను ఏ మూడ్‌లో, ఏ సందర్భంలో అన్నారో తనకు తెలియదని, అయితే ప్రతిదాన్ని నెగిటివ్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని రాజేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు. తనకు పద్మశ్రీ రావడంపై గతంలో తిరుమల నుంచి వస్తూ 'ఈ అవార్డు నాకు ఆ వేంకటేశ్వరస్వామే ఇప్పించారు, నాకంత సీన్ లేదు' అని తాను సరదాగా అంటే, కొందరు దాన్ని తప్పుగా హెడ్‌లైన్స్ పెట్టారని గుర్తుచేశారు. చిరంజీవి కూడా ఇలాగే ఏదో ఒక వేరే సందర్భంలో సరదాగా అని ఉంటారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అవార్డుల విషయంలో ఉత్తరాది, దక్షిణాది అనే చర్చ ఎప్పటి నుంచో ఉందని, దేశంలోనే అత్యున్నత స్థానాల్లో ఉన్న చిరంజీవి ఎన్నో బ్రహ్మాండమైన అవార్డులను అందుకున్నారని గుర్తుచేశారు. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న విషయాలను వెంటనే మర్చిపోవాలని చెప్తూ.. అవార్డులను అడిగి తీసుకోవడం భిక్ష అవుతుందని, అదే వారు గుర్తించి పిలిచి ఇస్తేనే గౌరవమని రాజేంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు.