పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తాడేరు గ్రామంలో ఘోరం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న కొత్తపల్లి అనంతవాణి అనే యువతి దారుణ హత్యకు గురైంది. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకోవడం కోసం ఏడాది క్రితం స్వగ్రామానికి వచ్చిన ఆమె వర్క్‌ఫ్రం హోం చేస్తోంది. ఈ క్రమంలో సమీప గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాడేపల్లి శ్యామ్‌బాబుతో ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. అయితే, అతడికి అప్పటికే వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారనే నిజం తెలియడంతో అనంతవాణి అతడిని దూరం పెట్టింది. పగ పెంచుకున్న శ్యామ్‌బాబు తెల్లవారుజామున అనంతవాణి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు. ఆమె తలుపు తీసిన వెంటనే పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమై గాయపడిన అనంతవాణిని స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఆమె తండ్రి దివ్యాంగుడు కాగా, తల్లి అనారోగ్యంతో మంచానికే పరిమితమైంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ, బ్యాంకు రుణం తీసుకుని ఇల్లు కట్టించి ఆ తల్లిదండ్రులకు అనంతవాణి ఏకైక ఆధారంగా నిలిచింది. శ్యామ్‌బాబు దాడి చేస్తున్న సమయంలో కళ్లముందే కూతురు విలవిలలాడుతున్నా, కనీసం అడ్డుకునే స్థితిలో కూడా లేని ఆ వృద్ధ తల్లిదండ్రుల పరిస్థితి స్థానికులను తీవ్రంగా కలచివేసింది.