Current Date: 17 Feb, 2026

బీఏ చదివి నకిలీ డాక్టర్ సిజేరియన్.. ఐదేళ్లుగా ఎన్నో ఆపరేషన్లు!

ఉత్తరప్రదేశ్‌లోని అంబేడ్కర్ నగర్ జిల్లా బస్ఖారీ పట్టణంలో గత ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఒక నకిలీ ఆసుపత్రి దారుణం వెలుగులోకి వచ్చింది. కేవలం డిగ్రీ చదివిన యోగేశ్ వర్మ అనే వ్యక్తి ప్రధాన వైద్యుడిగా, ఇంటర్ చదివిన శుభం విశ్వకర్మ సహాయకుడిగా చలామణి అవుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. యోగేశ్ తండ్రి గతంలో ఆసుపత్రిలో వార్డు బాయ్‌గా పనిచేస్తుండటంతో, అతడికి సాయం చేస్తూ నేర్చుకున్న అరకొర మెళకువలతోనే ఏకంగా క్లినిక్ ప్రారంభించి శస్త్రచికిత్సలు కూడా చేస్తూ వచ్చాడు. ఈ నెల 5వ తేదీన ప్రియాంక అనే యువతి ప్రసవం కోసం ఈ నకిలీ క్లినిక్‌లో చేరడంతో అసలు విషాదం మొదలైంది. సరైన అర్హత లేని యోగేశ్ ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స చేయగా, ఆపరేషన్ వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో దిగ్భ్రాంతికి గురైన మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఐదేళ్లుగా సాగుతున్న వీరి నకిలీ వైద్యం బాగోతం బయటపడింది. ప్రాథమిక విచారణలో వీరిద్దరికీ వైద్య విద్యతో ఎటువంటి సంబంధం లేదని నిర్ధారణ కావడంతో సదరు క్లినిక్‌ను సీజ్ చేశారు. ఒక సాధారణ వార్డు బాయ్ కుమారుడు ఏకంగా సర్జన్‌గా అవతారమెత్తి ఇన్నాళ్లూ క్లినిక్ నడపడం స్థానికంగా కలకలం రేపింది.