టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, నటుడు అల్లు శిరీష్ వివాహ వేడుకలతో అల్లు వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. శిరీష్, నయనికల వివాహం ఈ ఏడాది మార్చి 6న ఘనంగా జరగనుంది. విశేషమేమిటంటే, అల్లు అర్జున్-స్నేహల పెళ్లి రోజు కూడా ఇదే కావడంతో అల్లు కుటుంబంలో ఆరోజు రెట్టింపు ఉత్సాహం నెలకొననుంది. తాజాగా పెళ్లి పత్రికల పంపిణీ కార్యక్రమాన్ని అల్లు శిరీష్ ప్రారంభించారు. మన సంప్రదాయం ప్రకారం మొదటి ఆహ్వాన పత్రికను తన మామయ్య, మెగాస్టార్ చిరంజీవి - సురేఖ దంపతులకు అందజేశారు. ఈ సందర్భంగా తీసుకున్న ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో పంచుకుంటూ, పెద్దల ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ ఫోటోలో అల్లు అరవింద్ - నిర్మల దంపతులు కూడా ఉన్నారు. అయితే, ఈ ఫోటోలో చిరంజీవి భుజానికి షోల్డర్ బ్యాగ్ ధరించి కనిపించడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. మెగాస్టార్‌కు ఏమైంది? ఏదైనా గాయమైందా లేదా సర్జరీ జరిగిందా? అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
Share