కర్నూలుకు చెందిన కోవాబన్ విక్రేత వలీ అనే చిరువ్యాపారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అండగా నిలిచారు. ఇటీవల మేడారం జాతరలో కోవాబన్నులు అమ్ముకుంటున్న వలీని కొందరు యూట్యూబ్ ఛానల్ ప్రతినిధులు మతం పేరుతో ఇబ్బంది పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటనపై స్పందించిన లోకేశ్, వలీని త్వరలోనే స్వయంగా కలుస్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. గత వారం రోజులుగా కోవాబన్ వీడియో గొడవ టాప్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. "వలీ.. మిమ్మల్ని త్వరలో కలుసుకుంటాను, మీ కోవాబన్ రుచి చూస్తాను" అని మంత్రి ఆత్మీయంగా పేర్కొన్నారు. వలీపై కొందరు చేసిన నిరాధార ఆరోపణలు తనను కలచివేశాయని, మత సామరస్యాన్ని దెబ్బతీసే ఇటువంటి ప్రవర్తనకు మన సమాజంలో చోటు లేదని ఆయన స్పష్టం చేశారు. బాధితుడికి పూర్తి భరోసా కల్పిస్తూ, ప్రభుత్వం తరపున మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగు సమాజం ఎప్పుడూ ఐక్యత, పరస్పర గౌరవం మరియు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని లోకేశ్ గుర్తుచేశారు. ఒక సామాన్య వ్యాపారిని మతం ప్రాతిపదికన లక్ష్యంగా చేసుకోవడాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంత్రి స్పందించడంతో, సోషల్ మీడియాలో వలీకి మద్దతుగా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
Share