Current Date: 06 Jul, 2024

సింహాలను భయపెట్టిన చిట్టి ముంగీస..

పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో.. అడవిలో ఏనుగు సహా ఏ జంతువునైనా వేటాడి చంపి తినగల సింహాలను అనూహ్యంగా ఓ చిట్టి ముంగీస భయపెట్టింది! ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.ఆ వీడియోలో ఓ బొరియ సమీపంలో మూడు ఆడ సింహాలు సేదతీరుతుండగా ఒక్కసారిగా అందులోంచి ముంగీస బయటకు వచ్చింది. తన ‘ఇంటి’ వద్ద వాటిని చూసి కోపంతో గట్టిగట్టిగా అరించింది. ఆ అరుపులకు ఓ సింహం ఉలిక్కిపడింది. ఆ శబ్దం విని కాస్త దూరంగా ఉన్న మరో సింహం పరుగెత్తుకు వచ్చింది. ఆ రెండు సింహాలను చూడగానే ముంగీసకు మరింత కోపం వచ్చింది. ఆ రెండో సింహంపైకి దూకుడుగా దూసుకెళ్లింది. దాని ముందటి కాళ్లు, ముఖంపై కొరికి గాయపరిచేందుకు ప్రయత్నించింది. దీంతో ఆ సింహం వెనకడుగు వేస్తూనే కనిపించింది. మరో సింహం ఆశ్చర్యపోయి చూస్తుండిపోయింది. చివరకు ఇంకో సింహం తోకను కూడా కొరికేందుకు ముంగీస ప్రయత్నించినా అది త్రుటిలో తప్పించుకుంది.