ఒడిశాలోని పూరీలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత జగన్నాథుని ఆల యంలో ఈ నెల 14న అత్యంత రహస్యమైన.. రత్నభండాగారాన్ని తెరవనున్నారు. దీనిని 1978లో చివరి సారి తెరిచారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవరూ దాని జోలికి పోలేదు. అయితే.. ఆ మధ్య ఓ 20 ఏళ్ల కిందట ప్రయత్నించారని.. కానీ, రత్నభండాగారానికి ఉన్న సర్ప భద్రత కారణంగా.. ముందుకు అడుగులు వేయలేకపోయారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.దీంతో అసలు ఈ రత్నభండాగారం జోలికి ఎవరూ పోలేదు. అయితే.. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం దక్కించుకుంటే.. ఖచ్చితంగా రత్నభండాగారం తెరిపిస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారు. ఇది బాగా వర్కవుట్ అయింది. ఈ నేపథ్యంలో రత్న భండాగారం రహస్యంపై కమిటీ వేసి.. నివేదికలు తెప్పించుకున్నారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. ఈ భండాగారాన్ని తెరిచేందుకు రెండు తాళం చెవులు ఉన్నాయి. ఒకటి ఆలయం వద్ద ఉంటే.. రెండోది సర్కారు దగ్గర ఉంటుంది. సర్కారు దగ్గర ఉన్న తాళం చెవి పోయిందని..గత సీఎం నవీన్ పట్నాయక్ ప్రకటించారు. అందుకే తాము భండాగారాన్ని తెరవలేక పోతున్నామన్నారు. అయితే.. ఇప్పుడు ఆ తాళం చెవి దొరికినా.. దొరకకపోయినా.. తెరిచి తీరాల్సిందేనని బీజేపీ నిర్ణయించుకుంది.
Share