Current Date: 04 Jul, 2024

కోడ్‌ వున్నా భేరం కుదిరిన భూములకే క్లియరెన్స్‌ బరితెగించిన కలెక్టర్‌ మల్లికార్జున

ఎన్నికల కోడ్‌ అమలులో వున్నప్పటికీ భేరం కుదుర్చుకున్న పట్టా భూములకు జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున క్లియరెన్సు ఇవ్వడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది. గతంలో ఎప్పుడూ ఏ కలెక్టరూ బ్రోకర్లతో చేతులు కలిపి ఇంతటి నీచానికి పాల్పడిన దాఖలాలు లేవు. కానీ మల్లికార్జున మాత్రం బ్రోకర్లతో చేతులు కలిపి భేరం కుదిరిన భూములను 22(ఎ) నుంచి విడుదల చేయడంపై చర్చ జరుగుతోంది. తాజాగా 2024 మే 26వ తేదీన కంప్యూటర్‌ నెంబరు 361536/2023/ఇకెతో మల్లికార్జున సుమారు 22 ఎకరాలకు ప్రొసీడిరగ్స్‌ను విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ వుండగా ఇటువంటి ఉత్తర్వులను జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తారు. జూన్‌ 4వ తేదీ వరకూ ఎన్నికల కోడ్‌ అమలులో వుంటుంది. అయినప్పటికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహార్‌ రెడ్డి అండదండలు సంపూర్ణంగా వుండడంతో కలెక్టర్‌ మల్లికార్జున బరి తెగించి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ కొన్ని ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఎంతో మంది దళితులు తమ పట్టా భూములను ఢీ నోటిఫై చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. కాళ్ళ చెప్పులు అరిగేలా తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇలా పెందుర్తి, ఆనందపురం, తర్లువాడ వంటి అనేక గ్రామాల్లోని దళితులు తమ భూములను 22(ఎ) నుంచి తొలగించాలని తిరుగుతున్నారు. ఇందుకు అవసరమైన అన్ని పత్రాలనూ సమర్పించారు. అలాగే భీమిలి మండంలోని అనేక గ్రామాల దళితులు, పద్మానాభం మండంలోని అనంతవరం వంటి అనేక గ్రామాల్లోని వందల ఎకరాల భూమికి ఫ్రీ హోల్డ్‌ హక్కులు ఇవ్వకుండా కలెక్టర్‌ మల్లికార్జున తాత్సారం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మల్లికార్జున తరపున వ్యవహరిస్తున్న బ్రోకర్‌కు ఈ దళితులు తమ భూముల్ని కారు చౌకగా విక్రయించలేదు. అందువల్లనే కలెక్టర్‌ మల్లికార్జున ఈ భూముల వైపు కన్నెత్తి చూడలేదు. తనకు లాభసాటిగా వున్న భూములకు మాత్రమే మోక్షం కలిగించే ఉత్తర్వులను కోడ్‌ వున్నప్పటికీ జారీ చేశారు. సామాన్య రైతులు, దళితులు ఎన్నిసార్లు తహశీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరిగినా కలెక్టర్‌ పట్టించు కోలేదు. పక్క జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే పేదలకు సంబంధించిన పట్టా భూములకు స్వేచ్ఛను కలుగజేసి మన్ననలు పొందారు. విశాఖలో మాత్రం బ్రోకర్లు సిఫారసు చేసే భూములకే కలెక్టర్‌ మల్లికార్జున మోక్షం కలిగిస్తున్నారు. తాజాగా ఆనందపురం తహశీల్దార్‌, భీమునిపట్నం ఆర్డీవో ప్రతిపాదనలు పంపారంటూ సుమారు 22 ఎకరాల భూమిని ఫ్రీహోల్డ్‌ చేస్తూ కలెక్టర్‌ మల్లికార్జున ప్రొసీడిరగ్స్‌ విడుదల చేశారు. ఆనందపురం మండలం 133/2, 137/1, 138/4, 138/6, 139/2, 139/4, 164/3, 165/2, 169/2, 169/5, 171/3, 171/4, 173/2, 172/6 సర్వే నెంబర్లలోని 21.52 ఎకరాల పట్టా భూమికి ఫ్రీహోల్డ్‌ కల్పిస్తూ కలెక్టర్‌ మల్లికార్జున ఉత్తరువులు జారీ చేశారు. కలెక్టర్‌ మల్లికార్జున అవినీతి, అక్రమాలు బహిర్గతం చేయడానికి ఒక్క ఉత్తరువు చాలు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘమే కాకుండా, సీబీఐ విచారణ కూడా జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.