Current Date: 06 Jul, 2024

దేశాన్ని రక్షించేందుకు వందసార్లు అయినా జైలు కెళ్తా : కేజ్రీవాల్‌

ఎక్సైజ్‌ పాలసీ కేసులో తన మధ్యంతర బెయిల్‌ వ్యవధి ముగియనున్న నేపథ్యంలో ఢల్లీి ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించడానికి జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధమేనని, అందుకోసం వందసార్లు అయినా జైలుకు వెళ్లానని అన్నారు. తాజాగా పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేజ్రీవాల్‌.. ‘నేను భగత్‌సింగ్‌ అనుచరుడిని. దేశాన్ని రక్షించేందుకు జైలుకెళ్లాల్సి వచ్చినా వెళ్తానని’ చెప్పారు. జూన్‌ 4న విడుదలయ్యే లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 200 కంటే తక్కువ సీట్లు వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఇండియా కూటమికి 300 సీట్లకు మించి వస్తాయన్నారు. ‘నేను అవినీతికి పాల్పడినట్టు బీజేపీ చెబుతోంది. కానీ, అందుకు కావాల్సిన సాక్ష్యాలను మాత్రం చూపించడం లేదు. తాను అవినీతి చేస్తే ప్రపంచంలో ఇక ఎవ్వరూ నిజాయితీపరులు మిగలరని, మద్యం పాలసీ కేసులో రూ. వంద కోట్లు దోచుకున్నానని అంటున్నారు. దానికోసం 500 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అయినా ఒక్క పైసా సైతం స్వాధీనం చేసుకోలేకపోయారు. రూ.100 కోట్లు లంచం తీసుకుని ఉంటే బయటపడాలి కదా? మరెక్కడికి పోయాయి. అంత సొమ్ము గాల్లోనే మాయమైపోయిందా? అంటూ ప్రశ్నించారు.
‘తమ వద్ద ఎలాంటి రుజువు లేదు, రికవరీ కాలేదు. కేజ్రీవాల్‌ తెలివైన దొంగ’ అని ప్రధాని మోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అన్నారు. దేశం మొత్తం చూసేలా ప్రధానియే తమ వద్ద ఎలాంటి రుజువు లేదని చెప్పాక, ఈ కేసు ఒక ఫేక్‌ అని అర్థమవుతోంది. తాను చేస్తున్న అభివృద్ధి మోడీ చేయలేకపోతున్నారు. అందుకే తనను అరెస్ట్‌ చేశారని కేజ్రీవాల్‌ ఆరోపణలు చేశారు. ఢల్లీి, పంజాబ్‌లలో ప్రజలను నేను ఉచిత విద్యుత్‌ అందించాను. ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు తీసుకొచ్చాను. మేం చేసినన్ని మంచి పనులు ప్రధాని కూడా చేయలేదు. జూన్‌ 2న తిరిగి జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను. దేశాన్ని రక్షించేందుకు జైలుకెళ్లడం గర్వంగా ఉందని కేజ్రీవాల్‌ చెప్పారు.