Current Date: 12 Jun, 2026

హీరోయిన్ జాక్వెలిన్‌ పిటిషన్‌ విచారణ నుంచి వైదొలిగిన సుప్రీంకోర్టు జడ్జి.. రీజన్ ఏంటంటే?

ఆర్థిక మోసగాడు సుకేశ్‌ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌ కుమార్ మిశ్రా వైదొలిగారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయబృందంలో జస్టిస్‌ మిశ్రా కుమారుడు ఉండటంతో, పారదర్శకతను కాపాడేందుకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ పిటిషన్‌ను విచారించేందుకు మరో ధర్మాసనానికి బదిలీ చేయనున్నారు. మనీలాండరింగ్ కేసులో భాగంగా జాక్వెలిన్‌పై అభియోగాలు మోపాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఢిల్లీ ట్రయల్ కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను కొట్టివేయాలంటూ ఆమె మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ నిరాశే ఎదురైంది. హైకోర్టు నిరాకరించడంతో ఆమె సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. కాగా, జూన్ 3న ఢిల్లీ కోర్టులో జరిగిన విచారణలో తనపై నమోదైన అభియోగాలన్నింటినీ జాక్వెలిన్ పూర్తిగా తోసిపుచ్చారు. ఇదిలా ఉంటే, ఈ భారీ మనీలాండరింగ్ కేసులో అప్రూవర్‌గా (సాక్షిగా) మారేందుకు కూడా జాక్వెలిన్ ఫెర్నాండేజ్ గతంలో ముందుకు వచ్చారు. అయితే, ఆమె చేసిన ఈ అభ్యర్థనను దర్యాప్తు సంస్థ ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులోని తాజా పరిణామాలతో జాక్వెలిన్ పిటిషన్‌పై విచారణ మరింత ఆసక్తికరంగా మారింది.