దేశ సైన్యంలో చేరి సేవలందించేందుకు ఎదురు చూస్తున్న యువతకు కేంద్రం మంచి అవకాశం ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడపలో డీఎస్ఏ స్టేడియంలో నవంబర్ 10 నుంచి 15వ తేదీ వరకు అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీంతో ఈరోజు నుంచి ఆర్మీ ర్యాలీ మొదలవనుంది. మొదటిదశలో తమను తాము నిరూపించుకున్న వారిని రెండో దశకు ఎంపిక చేస్తారు. ఆసక్తి కలిగిన యువత నేరుగా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్న స్టేడియం వద్దకు చేరుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డీఎస్ఏ స్టేడియం మెయిన్ గేట్ వద్ద కుడి వైపున ఉన్న ట్యాంకు సమీపంలోని చిన్న మైదానం వద్ద రిజిస్ట్రేషన్లు చేస్తారు. అనంతరం అభ్యర్ధులందరూ ఆర్మీ అధికారుల సూచనల ప్రకారం ఆయా దశల్లో పాల్గొనాలి. అభ్యర్థులు గడ్డంతో రాకూడదు. నీట్గా షేవ్ చేసుకుని హాజరవ్వాలి. నకిలీ ధ్రువపత్రాలు తీసుకు రాకూడదు. ఎంపికలకు సంబంధించి వివరాలు, ఏవేని సందేహాలకు రిక్రూట్మెంట్ ఆఫీసు సిబ్బందిని మాత్రమే అడిగి తెలుసుకోవాలి. ఇతరులను సంప్రదించి మోసపోవద్దు. అభ్యర్ధులకు వ్యాధులు, గాయాలుంటే అనుమతించరు.