ఏపీలో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. నైరుతి రుతుపవనాల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోయాయి వేడి వాతావరణంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. అయితే తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా గుజరాత్-కర్ణాటక తీరాల వెంబడి ద్రోణి విస్తరించి ఉంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఉత్తర కోస్తాలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. అలాగే పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏల్లూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉంది అంటున్నారు.