ఎన్నికల్లో ఉచిత పథకాలతో ఊదరగొట్టడం.. గెలిచాక వాటిని అమలు చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు దివాళా తీయడం జరుగుతోంది. ఇప్పటికే కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ఆ దిశగా అడుగులు వేస్తుండగా.. ఏపీ పరిస్థితి కూడా దాదాపు అలానే ఉంది. హిమాచల్ ప్రదేశ్ కూడా ఇప్పటికే దివాళా అంచున ఉంది. ఎంతలా అంటే .. ఓ విద్యుత్తు సంస్థకు రూ.150 కోట్ల బకాయిలు చెల్లించడంలో హిమాచల్ ప్రభుత్వం విఫలమయినందున ఢిల్లీలోని హిమాచల్ భవన్‌ను స్వాధీనం చేసుకొని వేలం వేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లహౌల్, స్పిటి జిల్లాల్లో చెనాబ్ నదిపై 340 మెగావాట్టుల విద్యుత్తు ఉత్పాదన ప్రాజెక్టు నిర్మించేందుకు సెలి కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ కంపెనీ రూ.64 కోట్లను బయానా రూపంలో చెల్లించింది. అయితే ప్రాజెక్టు పనులను ప్రారంభించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం.. కేటాయింపు లేఖను రద్దు చేయడంతో పాటు, బయానాగా చెల్లించిన రూ.64 కోట్లను కూడా జప్తు చేసింది. దీనిపై ఆ కంపెనీ మధ్యవర్తి (ఆర్బిట్రేటర్)ని ఆశ్రయించింది. అయితే కంపెనీ బయానాగా ఇచ్చిన డబ్బుకు వడ్డీతో కలిపి రూ.150 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.